29, అక్టోబర్ 2015, గురువారం

ఆహ్వానం....!!




హితులకు... సన్నిహితులకు ... అందరికి ఇదే నా ఆహ్వానం...

27, అక్టోబర్ 2015, మంగళవారం

వెక్కిరిస్తున్న చేవ్రాలు....!!

కోల్పోయిన జీవితపు ఆశలన్నీ
మూకుమ్మడిగా దాడి చేస్తూ
ఊపిరి సలపనివ్వని అయోమయంలో
పడవేసి ప్రశ్నల శరాలు సంధిస్తూ
నన్ను నా ఎదురుగా నిల్చోబెడుతున్నాయి
నాలో నిద్రాణమైన మరో మనిషి సమాధానం కోసం
సశేషాలుగా మిగిలిన అవశేషాల ఆంతర్యాన్ని
వినలేని నిశ్చలత్వాన్ని అంది పుచ్చుకున్న
మూసిన మది తలుపుల ఆవల దాగిన
వసుదైక తత్వాన్ని నిదురలేపే యంత్రాలు ఎక్కడని
వెదికే యత్నంలో కాలిపోయిన కోర్కెల దాహానికి
ఆనవాలుగా నిలచిన మసి బారిన అద్దంలో
వెక్కిరిస్తున్న చేవ్రాలు కనిపించింది నవ్వుతూ...!!

15, అక్టోబర్ 2015, గురువారం

ఏక్ తారలు...!!

1. రాజీ పడిపోయింది రాజ్యాంగం_అధికారం చేతుల్లో నలిగి
2. వాసంతం పక్కనే ఉంటే_నువ్వు నాతోనే ఉన్నావని సంబరపడుతున్నా
3. నీ జ్ఞాపకాలలో బందీనై_జీవితమే తెలియలేదు 
4. నిదురెక్కడ నాకు_కలలోనూ నువ్వేనాయే
5. ఊటబావి మన జ్ఞాపకాల గతం_నీకు తెలియంది కాదుగా
6. సముద్రాల 'సు'దూరాన్ని_కలిపెను మూడుముళ్ల బంధం

6, అక్టోబర్ 2015, మంగళవారం

ఏక్ తారలు...!!

1. అక్షరాల ఆహార్యం అలాంటిది_అలుకలు కినుకులు అన్ని బలాదూరే
2. అన్ని మరచి అక్షరాలూ_నీతోనే ఉండి పోయాయి అందుకేనేమో
3. అక్షర చెలిమికి విలువ కట్టగలమా_వేల జన్మలు ఎత్తినా
4. పల్లవై పరిమళ రాగం ఆలపిస్తోంది_అక్షర చెలిమికి దాసోహమై
5. అన్నం పరబ్రహ్మ స్వరూపం_వాణీ నిలయం ఏక్ తారా సమూహం
6. ఓటమిలో విజయం_ఒక్క అక్షరానికే సాధ్యం
7. ఆద్యంతమూ మిగిలిపోయేది_అక్షర జన్మమే
8. నీ మనసు తీయదనంతో_బతుకు పయనంలో మనిద్దరమై

5, అక్టోబర్ 2015, సోమవారం

మాటల మడుగు గురించి నా మాటలు....!!

మెర్సీ ఈ మాటల మడుగు పుస్తకాన్ని ఇస్తూ అభిప్రాయాన్ని రాయండి అన్నప్పుడు ఆ ఏముందిలే పుస్తకం చదివితే రాయలేనా అనుకున్నా.. నా అభిప్రాయం తప్పని చదువుతుంటే తెలిసింది..నిజంగా చెప్పాలంటే నాకు అభిప్రాయం రాసే అర్హత ఉందో లేదో తెలియదు కాని ఓ నాలుగు మాటలు మాత్రం రాయాలని అనిపించింది...
కొట్టివేత చదువుతుంటే నిజంగానే కొట్టివేతల నుంచి మళ్లి కొత్తగా పుట్టుకు రావడం నిజం అనిపిస్తూ... మాటల మడుగులో మాటలు నోటి నిండా ఒకప్పుడున్నా ఆచేతానావస్థలో ఘనీభవించిన ఎన్నో జీవితాల్లోని మాటలను చూసాను.. నన్ను నేను చూసుకున్నాను.. ప్రశ్నల గది ప్రతి ఒక్కరికి అవసరం అని చదివిన ప్రతి ఒక్కరికి అనిపించక మానదు.. చీకటి దీపాన్ని చాలా కొత్తగా అనంతాకాశం ఏకాంతరాగం ఆలపించే వేళ చీకటిలో రంగుల దృశ్యాన్ని చూపడం మెర్సికే సాధ్యమైంది.... హృదయపు మెతుకులో చిదేమేసిన ఆలి అంతరంగాన్ని బహు చక్కగా చెప్పారు.. మాట్లాడనిమ్మని భాషకు నదికి అనుసంధానం చేస్తూ , మనుష్యుల మధ్య జరుగుతున్న పైచాచికత్వాల పరాకాష్టను చూపించారు... కవులు కాగితం, మనవి వీటిలో మనసు అక్షరాలుగా  కవి  కాగితంపై మిగిలిపోవడం అంటూ , మాటలు మనకు మనవి చేస్తున్న విశ్రాంతి గురించి ఎంత గొప్పగా చెప్పారో... సగం కొట్టేసిన చెట్టు నుంచి వచ్చిన మొలక ఆడా.. మగా అని విత్తనపు వీర్యంలో అడగడం అర్ధవంతంగా ఉంది.. కాడంబరిలో కలను హృద్యంగా వర్ణించారు... రాతిరి పగలు గురించి తలాష్ లో అమర్త్యకేకలో అంతరించి పోతున్న ప్రకృతి గురించి... ఖాళీలు మంచివే అంటూ చక్కని భావాలను ప్రసవించడానికి ఖాళీని ఆహ్వానించడం... అమరసత్యంలో ఎందఱో కోల్పోయిన బాల్యాన్ని... వెన్నెల స్నేహితాలో తీయని చెలిమిని.. వీడ్కోలు ఎంతగా బాధిస్తుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు... చిప్కోలో చెట్టు మనసుని.. తన్హాదిల్ లో ఇద్దరి మద్య దూరాన్నిఅక్షరాల వెన్నెల తాళ్ళతో ముడేసారు.. కొత్త ఆకాశంలో కవి మదిలో మెదిలే భావాన్ని.. తనతోనే నేను చదువుతున్నప్పుడు మనం కూడా ఆ  భావాల్లో తాదాత్మ్యం చెందిపోతాం అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు... నాకు బాగా నచ్చిన కవిత ఇది.. మిగిలిపోయిన దారం మనం వదలి వేస్తున్న బంధాలకు సాక్ష్యంగా మిగిలి పోతుంది.. దోసిలిలో నదిని ఎంత బాగా చూపించారండి.. నవ్వులు, మాటలు,మైలురాళ్ళు, మనిషి మాయాజాలం, ముగిసే పరిచయం, అవసరం,జీవితానికి కూడికలే కాకుండా అప్పుడప్పుడు తీసివేతలతో పని ఉంటుందని, గాజు మనసు, మనం చూడలేని ఎన్నో ఎద లోతుల్ని, ఉలిక్కి పడుతున్న ఊరి తలుపుల్ని,మరణం కనిపిస్తే కబురెట్టమని, సముద్రాన్ని అంబరాన్ని కలపడంలో చాలా లోతైన భావాలు... కొన్ని సామాజిక సంఘటనలకు స్పందనలు, పాదముద్రల్లొ కొందరి కథలు, స్వగతాలు, ఓటమి  గెలుపుల మధ్య, కాలాన్ని ఎలా కాల్చేస్తున్నాం అని, చెప్పకూడదు అంటూనే చెప్పిన మాటలు కొన్ని... లాలిపాడుతూ జోకొట్టిన చివరి కవిత... అన్ని వెరసి మెర్సీ మనసును అందులోని భావాక్షరాలను చూపించాయి...తప్పక  చదవాల్సిన ఓ మంచి కవితా సంపుటి "మాటల మడుగు" అనడంలో ఏ మాత్రం సందేహం లేదు...
ఇంత చక్కని మాటల మడుగును గుర్తుంచుకుని నాకందించిన మెర్సికి కృతజ్ఞతలు...

3, అక్టోబర్ 2015, శనివారం

"తల్లి లాంటి శిక్షణ - తండ్రి లాంటి రక్షణ" ...!!

ఏవిటో ఈ కార్పోరేట్ చదువులు ... నలుగురితో పాటు నడవక తప్పదని మనమూ తప్పక పిల్లల జీవితాలను కట్టడి
చేయాల్సి వస్తోంది.. "తల్లి లాంటి శిక్షణ  - తండ్రి లాంటి రక్షణ" అని పేరుకి మాత్రమే కాప్షన్లు పెట్టి వేలకు వేలు డబ్బులు దండుకోవడమే తప్ప కనీసం తిండి కూడా సరిగా పెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది...కనీసం మజ్జిగో పెరుగో తిని సరిపెట్టుకుందామన్నా తినలేనంత పులుపు.. పగలు రాత్రి పప్పుతో తినాలి.. పోనీ బట్టలు సరిగ్గా ఉతికిస్తారా అంటే అది లేదు ఇలా ముంచి అలా తెచ్చేస్తారు... ఏదో చదువు బాగుంటుంది అని మనం చూస్తుంటే దానితో వ్యాపారం చేస్తూ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు... పేరుకి మాత్రం రామన్ భవన్ కాని నీతి నియమాలు వారి ఇష్టం.. పత్రికల్లో టి విలలో ప్రకటనలు, ఇంటర్వూలు ఇచ్చుకుంటే సరిపోదు... కాస్తయినా తీసుకుంటున్న డబ్బుకి న్యాయం చేయాలి... పది మందికి ఒక బాత్రూం, దానిలో లైట్ ఉండదు, పేరుకి రూంలో ఏ సి ఉంటుంది కాని దానికి చల్లదనం ఎలా ఉంటుందో తెలియదు... ఎప్పుడు ఏ వస్తువులు పోతాయో తెలియదు... దొంగలు ఎవరో దొరలు ఎవరో తెలియని వింత సామ్రాజ్యం అక్కడ.. చెప్పినా పట్టించుకునే నాధుడు ఎవరు ఉండరు... ఇలా చెప్పుకుంటూ పొతే చాట భారతమే అవుతుంది... మన కార్పోరేట్ చదువుల ని(వి)లయాల సంగతి...
 ఈనాడు చడువునే స్థితి నుంచి చదువు కొనే పరిస్థితికి దిగజారాం మనం... దీనికి కారణం ఎవరు..? మనమే పెంచి పోషిస్తున్న ఈ కార్పోరేట్ చదువులు.. కాదంటారా...!!

2, అక్టోబర్ 2015, శుక్రవారం

మణి మాలికలు...!!

1. మరుపునే మర్చిపోతే సరి
ఎప్పుడు గుర్తుగానే ఉండిపోతుంది
2. ప్రాణమే నీలో కలిసాక
జీవశ్చవాన్ని నేనుంటేనేం లేకుంటేనేం
3. కన్నీళ్ళు నిండిన కళ్ళకు
నీ రూపం కనపడదేమోనని
4. దిగులు దుప్పటి చుట్టేసింది
   నీ వియోగాన్ని పరిచయిస్తూ  
5. దిగులుగా సాగుతోంది కాలం  
నువ్వు దగ్గరగా లేని క్షణాలను భారంగా లెక్కిస్తూ
6. అలిగిన దిగులు తీరాన్ని తాకింది
 నువ్వు నాలో చేరావని తెలిసి  

ఏక్ తారలు...!!

1. తడిమే తలపులు నిరంతరం_మనసు మెచ్చిన మధుర జ్ఞాపకాలే
2. అమ్మడి ఓరచూపులుండగా_ఇక వేరే ముళ్ళు ఎందుకనుకున్నాడేమో విధాత
3. ఆనందానికి అతిశయం తోడైనందుకేమో_పుడమి పులకరింత
4. అది జన్మ రహస్యం_భరతావని పుట్టుకకు కారణజన్ముని కోసమే శాకుంతల
5. పలకరింపుల ప్రహసనాలు_పడి లేచే కడలి కెరటాలు
6. అంతరంగం అద్దమైంది_నీ చదరంగపు ఎత్తుల్లో పడి

1, అక్టోబర్ 2015, గురువారం

పునఃపరిచయానికి....!!

గతాన్ని దాచేసి వాస్తవాలను ఓదార్చే
నా అహం చిన్నబోతోందెందుకో 
నీ జ్ఞాపకాల్లో నేను లేనని కాబోలు
ఎప్పుడో పలకరించిన నవ్వులు
వెలాతెలా పొతున్నాయెందుకో
నువ్వు మరచిన క్షణాలు
నాకు గుర్తున్నందుకేమో
కాలంలో కనుమరుగైనా
గుప్పెడు గుండెలో దాగి
పిడికెడు ప్రేమగా మెదిలే
పలకరింతల పునఃపరిచయానికి
ఎదురుతెన్నుల గవాక్షమై
మది ఆరాట పడుతోంది
మాయని మమతలను
నీకు కొత్తగా పరిచయిద్దామని...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner