25, సెప్టెంబర్ 2013, బుధవారం

ఏ ఇద్దరు ఒకేలా ఉండరు....!!

విజ్ఞత, వివేకం, చదువు, సంస్కారం ఉన్న అందరు వయసుతో పనిలేకుండా ఈ అంతర్జాలంలో హాయిగా అన్ని
పంచుకుంటున్నారు...!! ఓ విధంగా చూస్తే ఇది బానే ఉంది...కాకపొతే మన పని మనం చేసుకోకుండా ఎంతసేపూ ఎదుటివారి గురించి ఏదో రాబట్టాలనుకోవడం సంస్కారం కాదు...!!
మన ఇష్టాలని అభిప్రాయాలని అందరు ఇష్టపడాలని అనుకోవడం, మన ఆలోచనలు ఎదుటివారి మీద బలవంతంగా రుద్దాలని ప్రయత్నించడం సమంజసం కాదు...!! మన ఆలోచనలు అభిప్రాయాలు మనవి అంతే కాని ఎదుటివారికి మనలా ఉంటాయనుకుంటే అది తప్పు...!! ఏ ఇద్దరు ఒకేలా ఉండరు....ఒకే అమ్మ కడుపున పుట్టినా ..మన చేతికున్న ఐదు వేళ్ళలా....!!
ఇంటి సమస్యని అందరి సమస్యగా చేయకుండా మన వరకే పరిమితం చేసుకున్నట్టుగా మన అభిప్రాయాలను కూడా మనకే పరిమితం చేసుకుంటూ ఎదుటివారి ఆలోచనలను గౌరవించే సంస్కృతికి స్వాగతం పలుకుదాం...!! స్నేహాన్ని స్నేహంగానే ఉండనిచ్చి ఆ విలువను ఉన్నతంగానే ఉంచుదాం....!! విపరీత ధోరణులకు పోకుండా మనకున్న విలువలతో మన సంప్రదాయ ధోరణిలోనే ముందుకు సాగుదాం...వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలగకుండా...చక్కని బంధాలతో అనుబంధాలను నిర్మించుకుంటూ....!!

24, సెప్టెంబర్ 2013, మంగళవారం

అలా ఉండి పొనీ..!!

కనుల కలలు కడలి అలల కధలు 
నీకు చెప్పాలనే ఉన్నది....వినే మనసుంటే....!!
మాటల మాటున మది తలపులు 
మౌనంగా నీకు చేరువగా నీ పిలుపు కోసమే....!!
చెరగని గురుతుల జ్ఞాపకాల సాక్షిగా
నీకు అర్ధం కాని అనుబంధం కోసం ఆరాధనగా...!! 
ఒంటరితనంలో ఏకాంతానికి దూరంగా
నీ ఊసుల ఉరవడిలో సాగే ప్రవాహమే నేను..!!
ఆద్యంతాలలో మధ్యన ఉన్న నా ప్రాణం 
నీ ప్రేమ కోసం తుది శ్వాస వరకు నిరీక్షణే....!!
ఓ చిన్న అనుభూతిలా నిను తాకనీ 
అలా ఉండి పొనీ..నీతోనే....ఆ జన్మాంతం....!!

22, సెప్టెంబర్ 2013, ఆదివారం

నిశ్చల సమాధిలో నిరవధికంగా....!!

వేదనలో మనసు శోధనలో
మనిషి అంతరంగ ఆవిష్కరణ...!!
కలగలిసిన భావ పరంపరకు
ఆకృతినివ్వలేని అసహాయత...!!

కోపమో ఆవేశమో అర్ధం చేసుకోలేని
మనసు లోని మరో మనిషి...!!
మారుతున్న విలువల వలువల
వ్యాపారంలో ఇమడలేక నిస్సహాయత....!!

తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుల పరిహాసం
పై పై పూసుకున్న అలంకారాల ఆహార్యం...!!
అక్కర్లేని ఆత్మాభిమాన అందం
అంతు చిక్కని అంతః సౌందర్యం...!!

ధనానికి దాసోహం చేస్తూ తలను వంచి
వెల వెల పోతూ వలసలు వెళిపోతూ....
పరదా మాటున మేలి ముసుగులో మోసపోతూ
దాస్య శృంఖలాలను తెంచుకోలేక....!!

బంధాలకు బందీగా చిక్కుకుని
భాద్యతలకు బానిసగా మారి....
కష్టమైన ప్రేమను ఇష్టంగా ఇష్టపడుతూ
నిశ్చల సమాధిలో నిరవధికంగా....నీ  ప్రేమ కోసం...!!

ధనం మూలం మిదం జగత్...!!

వైద్యులను, పూజారులను ఎందుకు నమ్ముతాం...?? మనకు తెలియని విజ్ఞానము, శాస్త్రము వాళ్ళకు బాగా తెలుసు
అన్న నమ్మకంతో...!! ప్రతిదీ వ్యాపార సంబంధమైన ఈ రోజుల్లో కీర్తి ప్రతిష్టలు పుష్కలంగా ఉన్నా....ధనం మూలం మిదం జగత్ అన్న నానుడిని అక్షరాలా పాటిస్తున్న పెద్దలకు పాదాభివందనాలు...!!
జలుబు చేసి కాస్త పేరున్న కార్పోరేట్ ఆసుపత్రికి అందుబాటులో ఉన్నది కదా అని వెళితే వాళ్ళకు అందుబాటులో ఉన్న అన్నిటెస్టులు ఒక వెయ్యి రూపాయలకు మాత్రమే రాసి పొద్దున్న వెళితే సాయంత్రానికి రిపోర్టుల్లో ఏమి లేదు అంతా బాగానే ఉంది అంటూ ఓ మూడువందల రూపాయల( పాపం తక్కువే మరి జలుబే కదా...!! ) మందులు రాసి పంపే వైద్య నారాయణులు ఉన్న సమాజమండి మనది...!! ఠాగూర్ సినిమాలోలా అన్నమాట....-:)
దేవుడి గుడిలో విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం పెట్టమని పేద్ద పేరున్న ఆస్థాన ఘనాపాటిని అడిగితే సొమ్ములు ఎంత కావాలో చెప్పి మంచి ముహూర్తంలో పూజలు చేయడానికి వారికి తీరిక లేక...విగ్రహ ప్రతిష్ట చేసిన జంటకు చావు ముహూర్తం పెట్టిన ఆ ఆచార్యులకు ఎన్ని సార్లు పాదాభివందనం చేసినా తప్పు లేదు...!!
గృహ ప్రవేశానికి ముహూర్తం పెట్టమని అడిగితే పాపం పైన చెప్పిన విధంగానే అసలు ముహూర్తమే లేకుండా పెట్టిన సుముహూర్తం....చవితి రాకుండానే చవితి పూజలు చేయించి తమ పని చేసుకుందామని మరొకరు....ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి...ఇదిగో ఇప్పుడు ఉన్న తెలంగాణా సీమాంధ్ర సమస్యలా అన్నమాట....!!

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

నువ్వు నాకు ఇచ్చిందే....!!

నీ కోసం ఎన్నాళ్ళో ఎదురు చూసిన ఆత్మీయత
నీ నిర్లక్ష్యానికి గుర్తుగా ఆవేదనతో అస్సహాయతతో
నిరాశతో నిస్పృహతో మది తలుపులు మూసుకుంటే....!!

ఇన్నాళ్ళు గుర్తుకే రాని ఆ అనుబంధంతో 
ఎందుకో ఒక్కసారిగా నీ మనసు నిండిపోతే...
ఆశగా వచ్చిన నీకు...ముడుచుకు పోయిన జ్ఞాపకాలు కనిపిస్తే....!!

ముక్కలైన మనసును అతుకులేసి అందంగా
చూపిద్దామన్న నా ప్రయత్నం పరిహసిస్తోంది నన్ను....
ఎగతాళిగా గేలి చేస్తూ...ముక్కల్లో నీ లెక్కలేని రూపాల్ని చూపిస్తూ...!!

ఎన్ని యుగాలు నీకోసం ఎదురు చూసానో... 
దగ్గరగా వస్తావేమోనని...ఆలంబనగా ఉంటావేమోనని...
లెక్కలేసి చెప్పడానికి కూడా అందని చుక్కల లెక్కలే సుమా....అవి....!!

నీకు తెలియని కాలము కాదు...నువ్వు లేని నేను కాదు
ఎదురు చుసిన క్షణాలు....ఎదుట లేని ఎద లోతులు...
రెప్ప పడితే కనుమాయమౌతావేమోనని రెప్ప వాల్చని క్షణాలనడుగు...!!

మూసుకు పోయిన మది ... ముడుచుకు పోయిన జ్ఞాపకాలు
వెలికి తీయలేని వెతల కతల కలతల కంట నీరింకిన ఆ క్షణమే...
నువ్వొస్తావన్న ఆశను అణగదొక్కి కఠిన పాషాణంగా మారిన మరుక్షణం...!!

నీ రాక లోని మార్పుల ఆంతర్యాన్ని చేరువలో ఉన్నా ...
చూడలేని వ్యధ శిలలలో చేరిపోయిన నా మనసు...
నువ్వు నాకు మిగిల్చిన జ్ఞాపకాలే నీకు గురుతులుగా వదలి పోయింది...!!

19, సెప్టెంబర్ 2013, గురువారం

మనిషి ఘర్షణ....మనసు సంఘర్షణ....!!


అంతర్మధనంలో అంతరాత్మని చంపి
అంతర్నేత్రంలో ఆత్మానందాన్ని దూరం చేసుకుని
నిర్వేదాన్ని నిర్విఘ్నంగా స్వాగతిస్తూ....

నిస్సార నిర్లక్ష్య జీవితానుభూతిని
పరమావధిగా పరమపద సోపానంగా తలుస్తూ

వాదనలో వేదనని కోరుకుంటూ.... 

బంధాలకు అందకుండా జరిగిపోతూ 
బాధ్యతలకు భయపడి అనుబంధమే లేకుండా చేసుకుంటూ
అంటరానితనంతో అస్పృశ్యులుగా ఉంటూ...

అహంకారాన్ని ఆస్థిగా గర్వపడుతూ
అందరిలో నేను అన్న చట్రంలో ఒంటరిగా బతుకుతూ
అహాన్ని ఆనందమని భ్రమపడుతూ....
  
చిరునామా లేని చిరు నామమైపోతూ
గల్లంతై పోతూ కూడా గుండెల్లో ఉన్నా అనుకుంటూ
మభ్యపడుతూ మోసం చేస్తూ...

సహవాసానికి  సమీపంలో లేకుండా
సహస్ర యోజనాల సుదూర తీరంలో గమ్యం లేని
ప్రయాణంలో ముందుకు పోయే....

జీవితానికి అర్ధం పరమార్ధం ఎక్కడో...!!

16, సెప్టెంబర్ 2013, సోమవారం

ఇలా ఎన్నాళ్ళో....!!

నకిలి నోట్ల హవా జనాల మధ్యనే కాకుండా....ఏ టి ఎమ్ మెషిన్లకే పరిమితం కాకుండా బ్యాంకులకు
వ్యాపించింది...బయట అయితే దొంగ నోట్లేమో అని కాస్త జాగ్రత్త పడతాము... కాని బ్యాంకు లోపల కూడా చక్కని దొంగనోట్లు మనకు అందిస్తున్న ఈ ముఠాల తెలివిని ఎలా అభినందించాలో తెలియడం లేదు. కొన్ని రోజులు పొతే అసలు నోట్లే నకిలీ నోట్లు అయిపోతాయేమో...!! టెక్నాలజీ ఎక్కువైనా ఇబ్బందిగానే ఉంటోంది....మంచికి పనికిరాని టెక్నాలజీ చెడుకి చక్కని సహకారాన్ని అందిస్తోంది. అందరికి అసలు నోట్లకి నకిలీ నోట్లకి తేడా తెలుసుకునేంత అవగాహన ఉండదు...ముఖ్యంగా పల్లెల్లోని వారికి...బ్యాంకులో అయితే మోసం చేయరు అని నమ్మకంతో వెళతాము...ఇచ్చిన ప్రతి నోటుని అక్కడ చూసుకోము...ఈ నకిలీ నోట్ల ముఠాలతో బ్యాంకులు కూడా కుమ్ముక్కైపోతే  సామాన్యుల గతి ఏంటి...?? 500 లేదా 1000 నోటో తీసుకున్న మొత్తంలో ఒక దొంగ నోటు వచ్చినా వారికి భారమే...!! కరంట్ బిల్లుల మోతలు ఓ పక్క....ఉల్లి, వెల్లుల్లి, పప్పుదినుసుల ధరలు ఓ పక్కా...కూటికి గుడ్డకు రాని రాజకీయాలు మరోపక్కా....ఇలా నొక్కేస్తూ ఉంటే...పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉంటే..గోరుచుట్టు మీద రోకలి పోటులా సకాలంలో నీరివ్వని సర్కారు...అక్కరలేనప్పుడు నా కరుణ మీ కోసమే అంటూ కరుణించే వరుణుడు...ఏంటో ఈ అర్ధం కాని జీవితాలు ఇలా ఎన్నాళ్ళో....!!

12, సెప్టెంబర్ 2013, గురువారం

గుర్తుకురాని.... !!

నే రాసుకున్న కావ్యమే ఇది.... 
కన్నీటి కడలిలో తేలిపోతోంది
తడిచిన మనసు కాగితాలు
చెమ్మతో చెలిమి చేస్తుంటే
చెరిగి పోతున్న సిరాక్షరాలు
ఒక్కొక్కటిగా మాయమై పోతుంటే
శిలాక్షరాలన్న భ్రమలో నుండి బయట పడి....
నీటి మీది రాతలని నుదుటిపై
రాసిన  విధిని నిందించాలో...!!
మళ్ళి కొత్తగా రాసుకోవాలన్న
ప్రయత్నాన్ని ఆరంభించాలో....!!
గతంలో జ్ఞాపకాలు మాత్రమే గుర్తుగా
వాస్తవాన్ని మరచి పోవాలో..!!
గుచ్చుకునే గురుతుల గునపాల్ని
గుండెల్లో దించుకోవాలో....!!
అంధకారంలోకి ఆశగా
కనపడని వెలుగు కోసం
ఎదురు చూడటం...!!
అర్ధం లేని వ్యర్ధమైన నిరీక్షణ...!! 

11, సెప్టెంబర్ 2013, బుధవారం

ఈ జన్మకి....!!



చిరునవ్వు అందనంత దూరంలో
ఆకాశంలో చుక్కల్లో చేరి చూస్తోంది.....
మురిపించే మువ్వల సవ్వడి
వినిపించినా మనసుకు అందడం లేదు....
రుధిరాన్ని వర్షించే కన్నీటి మేఘాలు
కమ్ముకున్న మనసు మౌనంగా రోదిస్తోంది....

ఎదలోని వెతలు కతలుగా కలసి
అందమైన అక్షరాల్లో అలసి జారిపోతున్నాయి....
చిమ్మ చీకటిలో మిణుగురుల వెలుగులో
ఎక్కడో దూరంగా ఓ వెలుగు రేఖ సూఛాయగా...
మాయమైన ఆనవాలు మబ్బుల మాటుగా
తొంగి చూస్తోందేమోనని పలకరింపుల పరిచయం....
వెంట పడే నీడలో కనిపించే క్రీనీడ
వదలకుండా వెన్నాడే జ్ఞాపకాల రణగొణ సోద....
ఎక్కడో మాటుగా  వెన్నెల చాటుగా
పదిలంగా దాగిన నీ గురుతుల జ్ఞాపిక..... 
మలయమారుతమై వాసంత సమీరమై
నను చుట్టిన అందాల హరివిల్లు ఈ జన్మకి....!!

6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఆ రోజు తొందరగా వస్తే ఎంత బావుండు...!!

బాధ్యతను పంచుకోని  బంధానికి ప్రశ్నించే హక్కు మాత్రం ఎక్కడిది...?? బంధాన్ని పంచుకోమంటే బరువుగా మారి,
మనసు ముక్కలు చేస్తే ఆ బంధాన్ని భరించడం అవసరమా...!! వేసిన తప్పటడుగు తప్పుటడుగుగా వెక్కిరిస్తుంటే ఏమి చేయలేని నిస్సహాయతను ఆసరాగా చేసుకోవాలా...!! ఇంకా ఇంకా అధఃపాతాళానికి కుంగి పోవాలా...!! నమ్మిన పాపానికి నమ్మకమే లేని జీవితాన్ని కానుకగా ఇచ్చి క్షణక్షణం భయాన్ని, బాధను తోడుగా ఉంచుకోమని చెప్తూ...బతుకే లేకుండా చేస్తుంటే...!! క్షమయా ధరిత్రి అన్న పేరు కోసం పాకులాడటం మనిషినే కాదు మనసునే  చంపుకోవడంతో సమానం...!!
ఒకరికి మన వేలు చూపించే ముందు మన నాలుగు వేళ్ళు మననే చూస్తూ ఉంటాయని మర్చి పోతున్నాము. అబద్దాలు చెప్పో, నలుగురిలో చాలా మానవతా వాదిని, మంచితనం నా చిరునామా అని నటిస్తే నాలుగు రోజులు పోయాకయినా మనమేంటో అన్నం తినే ఆ నలుగురికి తెలియదా...!! అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నా అనుకున్న అనుబంధాలు అక్కరలేదు అనుకుంటే....సున్నా ముందు ఒకటి లేక పొతే సున్నా విలువ ఎంతో మన విలువా అంతే అని తెలిసే సరికి ఈ జీవితం ముగింపుకి వచ్చేస్తుంది.
మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందని తెలిస్తే దానిని అడిగినా లేదా అది చెప్పేది విన్నా సరిపోతుంది....కనీసం మనం మన బాధ్యతలలో ఒక్కటి అయినా సక్రమంగా నిర్వర్తించామో లేదో...!! మనస్సాక్షి నోరు నొక్కేసి అహాన్ని ఇంటి పేరుగా చేసుకుంటే  రేపటి రోజున మన నటన బయటపడి మనకంటూ ఒక్కరు కూడా లేకుండా ఒంటరిగా మిగిలి పోవాలి. ఎదుటి వారికి మనం ఏది ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది....ప్రేమ అభిమానం ఇస్తే అంతకు రెట్టింపుగా దొరుకుతాయి....నన్నంటుకోకు నా మాల కాకి అంటే(క్షమించాలి )....మనం కూడా అలానే ఉండాలి...!! నమ్మి వచ్చిన బంధాన్ని నమ్మకంగా చూసుకోవాలి.... నలుగురిలో నవ్వులపాలు చేయాలని చూస్తే మనమే  నవ్వులపాలు అవుతామని తెలుసుకోవాలి. బెదిరింపులకు భయపడే రోజులు పోయి బయటకు పొమ్మనే రోజు రాకుండా చూసుకుంటే చాలు. ఎన్నాళ్ళైనా...ఎన్నేళ్ళయినా మన బుద్ది మారకపొతే మన అనుకున్న అనుబంధాలకు దూరం కావడానికి ఎంతో సమయం పట్టదు. మనకి మనం గొప్ప దివి నుంచి భువికి దిగి వచ్చాము అనుకుంటే సరి పోదు....నలుగురు చెప్పాలి కాని బాజా భజంత్రీలు వాయించే వాద్య బృందం చెప్తే అది నిజం కాదని తెలుసుకున్న రోజు మనని మనం తెలుసుకున్న రోజు....!! ఆ రోజు తొందరగా వస్తే ఎంత బావుండు...!!

5, సెప్టెంబర్ 2013, గురువారం

గురుపూజాదినోత్సవ శుభాకాంక్షలు....!!


ఓం శ్రీ గురుభ్యోనమః....!!
ఓంకారం ఆది ప్రణవ నాదం...ఈ చరాచర సృష్టికి మొదటి నాదం...!! ఓంకారంతో నాద స్వరూపాలు రూపుదిద్దుకున్న సృష్టి స్థితి లయలకు ప్రణవ నాదమే ప్రాణ నాదం. మన జన్మకు కారణమైన అమ్మనాన్నలు తొలి గురువులు...నడత నడక, నడవడిక, విద్యాబుద్దులు నేర్పే గురువు అమ్మానాన్నలు కలసిన త్రిమూర్తుల ఏకరూపం...అందుకే గురువు పరబ్రహ్మ స్వరూపం..గురువు లేకుండా నేర్చుకున్న విద్య పరిపూర్ణం కాదని పెద్దల మాట...మన నిత్య జీవితంలో ఎందరో మనకు మార్గదర్శకంగా ఉంటూ మనల్ని తీర్చిదిద్దుతారు....అది ఏ రూపంగా అయినా కావచ్చు...చదువు సంధ్యలే కాకుండా జీవిత పాఠాలు నేర్పుతారు...అలా నేర్పిన ప్రతి ఒక్కరు మనకు గురు సమానులే...!! అందుకే పూజ్యనీయులైన గురువులందరికీ గురుపూజాదినోత్సవ శుభాకాంక్షలు...వందనాలు...!! 

4, సెప్టెంబర్ 2013, బుధవారం

నీతో నా పయనం.....!!

నీతో నా స్నేహమా....
ఎక్కడో రాలిపడిన స్వప్నంలా ఉందే...!!
నీతో నా ప్రణయమా....
ఎప్పటికి గుర్తుగానే ఉందే గుంభనంగా...!!
నీతో నా సహవాసమా....
నిరంతరం నా నీడలా వెంటాడుతూనే ఉందే....!!
నీతో నా సహజీవనమా...
తుది మజిలి వరకు తోడు ఉంటానంటుందే...!!
నీతో నా సహచర్యమా....
జన్మ జన్మలకు సాంగత్యాన్ని కోరుతోందే....!!
నీతో నా అక్షర ప్రయాణమా....
ఇలా సాగుతూనే ఉంటుంది చివరి శ్వాస వరకు....!!
నీతో నేను.....
ఓ జ్ఞాపకంగా నువ్వు....వాస్తవంలో నేను....!!

2, సెప్టెంబర్ 2013, సోమవారం

ఓ సగటు మని...షి....!!

అందలాలు ఎక్కిస్తావనుకోలేదు
అంబరాన్ని అందిస్తావని అనుకోలేదు
ఆశల శిఖరాన్ని అందనంత ఎత్తులో ఉంచావు
అధః పాతాళానికి నన్ను తోసేశావు

ఎండమావుల వెంట పరుగులు తీస్తూ
మలయ సమీరాన్ని కాలదన్నావు
మంచుపూల గంధాన్ని కాదన్నావు
మండుతున్న చితిలో హారతిని చూస్తున్నావు
మనసు నైవేద్యాన్ని నేలపాలు చేసావు
మనిషినే మరబొమ్మగా మార్చేసావు
బంధమైన అనుబంధాన్ని అల్లరిపాలు చేసావు
బతుకు నేర్పిన బాటను మరిచావు

అస్త వ్యస్త మలుపులతో అర్ధం లేకుండా
జీవితాన్ని ముగింపు లేని కధగా చేసి
చిత్రమైన వి చిత్రాన్ని చూస్తున్నావు
నువ్వు ఓ సగటు మని...షివే అని నిరుపించుకున్నావు....!!

1, సెప్టెంబర్ 2013, ఆదివారం

నీకిది న్యాయమా....!!

ఏమి తెలియని నేను
నువ్వు మాత్రమే కావాలనుకుంటుంటే...!!
చీకటి మాటున దాగిన నువ్వు
వెలుగు చూడలేనంటూ దాక్కుంటున్నావు....!!

నీతో అనుబంధాన్ని తోడుగా కోరుకుంటే
అంతులేని వేదనను నాకు ఆసరాగా ఇచ్చావు...!!
ఆలంబనగా ఉంటావనుకుంటే
గుచ్చుకునే జ్ఞాపకాలను జతగా చేసావు....!!

అభిమానాన్ని అందించమంటే
అహాన్ని అడ్డుగోడగా చేసి ఆనందిస్తున్నావు...!!
అర్ధవంతమైన బతుకునిమ్మంటే
వ్యర్ధమైన జీవితాన్ని చూస్తూ నవ్వుకుంటున్నావు....!!

పగిలిన మనసు ముక్కలలో
లెక్కకు రాని రూపాల్లో నువ్వే కనిపిస్తూ.... కవ్విస్తూ....
చితికిపోయిన నా హృదయాన్ని చిదిమేసి
నీ దారిన నువ్వు పోతున్నావు...నీకిది న్యాయమా....!!

రూపాయి చిక్కడానికి కారణం ఎవరు....??

ఆర్ధిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తు భారతదేశాన్ని బలమైన శక్తిగా రూపొందిస్తారని ఆనాడు మన ప్రధానిగా శ్రీ మన్ మోహన్ సింగ్ గారిని అనుకుంటే...జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధి తరువాత ఎక్కువ రోజులు పదవిలో  ఉన్న వ్యక్తీ కూడా ఈయనే...రోజు రోజుకి రూపాయి చిక్కి శల్యమై పోతున్నా.... రాష్ట్రాలను ముక్కలు చేస్తూ తద్వారా దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నా తనకు ఏమి పట్టనట్టుగా ఉన్న మొదటి చివరి ప్రధానమంత్రి మన్మోహనుడేమో...!! ఆహార బిల్లులు, ఆ ఋణం మాఫీ, ఈ అభివృద్ధి పధకాలంటూ జనాన్ని మోసం చేస్తూ కొడుకుని ప్రధాని హోదాలో చూడాలనుకుంటున్న మేడం గారి చెప్పుచేతల్లో ఉంటూ ఆమె చెప్పిన దానికల్లా సరే అని తలాడిస్తూ తనకంటూ ఉనికి లేకుండా జరుగుతున్న అరాచకాలకు కనీసం ఓ మనిషిగా కూడా స్పందించని ప్రస్తుత ప్రధాని....ఎందుకా పదవిలో ఉన్నట్టో మరి...!!
ఒక చోట అప్పు తీర్చడానికి మరోచోట అప్పు చేసి ఓట్ల కోసం జనాలను మభ్యపెట్టడం సమంజసమా..!! మన ఉత్పత్తులను వదిలేసి దుగుమతుల కోసం అర్రులు చాస్తూ రోజు రోజుకి అధఃపాతాళానికి పడిపోతున్న రూపాయి విలువను...దానితో పాటుగా దేశ ప్రగతిని పెంచేది పోయి నా పదవి నాకు ఉంటే చాలు అనుకుంటున్న ఇప్పటి రాజకీయ నాయకులను ప్రజలు నమ్మడం మానేసి తమకు కావాల్సిన దానికోసం తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు...నాయకుల వెంట జనం నడిచే రోజులు పోయి జనాల వెనుక నాయకులు నడిచే రోజులు వస్తున్నట్టుగా అనిపిస్తోంది...!!
ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా...అధినాయకురాలిని నేనే అని ఏ నిర్ణయం తీసుకున్నా వచ్చే ఎన్నికల్లో మనుగడ కష్టమే అని....ప్రజలు పార్టీకి శెలవు ప్రకటిస్తారని కిరణ్ కుమార్ గారు అమ్మగారికి హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజన గురించి మాట్లాడటానికి తెలుగు వారు వెళితే ఢిల్లీ నాయకులు కనీసం వారి గోడు వినకుండా మా నిర్ణయం అయిపొయింది...మాతో మాకేం పని లేదు అన్నట్టుగా కనీస మర్యాద కూడా లేకుండా చాలా ఘోరంగా కించపరుస్తూ మాట్లాడుతుంటే తెలంగాణా, సీమాంధ్ర అని లేకుండా ప్రతి తెలుగు వాడు తిరగబడాలి. తెలుగువాడి సత్తా ఏంటో చూపాలి...!!
పనికిరాని చెత్త రాజకీయాలు, కుట్రలు మానేసి బక్క చిక్కి పోతున్న రూపాయిని బలంగా చేసే ఆలోచన చేస్తే ఓట్లు కాస్తయినా పడతాయి.
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner