21, మార్చి 2017, మంగళవారం

మారని నేతల తీరు...!!

నేస్తం,
        మనం ఎన్ని చెప్పినా, ఏమి చేసినా మనం ఎన్నుకున్న ప్రజా నాయకుల తీరు మారబోదని మరోమారు ఋజువు అవుతోంది. అధికార పక్షమా, ప్రతి పక్షమా అని లేకుండా ప్రజల తీర్పుతో గెలిచామని మర్చిపోయి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న నేటి రాజకీయ ప్రముఖులు మనకి అవసరమా... ఒకప్పుడు ప్రచార మాధ్యమాలు లేవు. ఇప్పుడు ప్రపంచం యావత్తు చూస్తుందన్న ఇంగిత జ్ఞానంలేని ఈ నాయకులనా మనం ఎన్నుకున్నది అని ప్రతి ఒక్క ఓటరు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసెంబ్లీ / పార్లమెంట్  అంటే ప్రజల సమస్యలను, అవసరాలను తీర్చాల్సిన బాధ్యత కలిగిన ప్రజానాయకులు ఉండాల్సిన చోటు. నోటుకు ఓటు అమ్ముడు పోయినంత కాలం ఇలానే ఉంటుంది. ప్రజల పక్షాన మాట్లాడే నాయకులు మాత్రమే అసెంబ్లీ / పార్లమెంట్లో అడుగుపెట్టే రోజు ఎప్పుడు వస్తుందో...!!

శి(థి)లాక్షరాలు...!!

అంతుపట్టని మనసు మధనానికి
అక్షర రూపమివ్వడానికి ఆత్రపడే
కలానికి సాయంగా మిగిలిన
తెల్ల కాగితం చిన్నబోతోంది

కాలంతో పోటీగా పరుగులెత్తే మది
అలసట తెలియక అడుగులేస్తునే
అసంతృప్తిగా అడ్డు పడుతున్న
భావాలను నిలువరించాలని చూస్తోంది

గత జన్మాల ఖర్మ ఫలితాలకు
సాక్ష్యంగా నుదుటిరాతల గీతలు
చేతిలోని రాతలుగా మారుతూ
వెలుగు చూస్తున్న తరుణమిది

మనుష్యులతో అల్లుకున్న బంధాలు
మానసాన్ని వీడలేక వెలువరించే
శి(థి)లాక్షరాలు చీకటికి చుట్టాలుగా చేరక
చెదరని శిల్పాలై వెన్నెలకాంతులు వెలువరిస్తాయి...!!

ప్రపంచ కవితా పండుగ రోజు శుభాకాంక్షలు అందరికి ....!!

20, మార్చి 2017, సోమవారం

మరచిపోతున్నారు...!!

నేస్తం,
         ప్రతిభను గుర్తించడం పక్కన పెట్టినా కనీసం ఒకే ఊరిలో ఉన్న వాళ్ళను పిలవాలని కూడా లేకుండా పోతోంది కొందరికి. కుటుంబాలకే పరిమితం అనుకున్న అహాలు, ద్వేషాలు సాహిత్యానికి కూడా అంటుకుంటున్నాయి. బయటివారు గుర్తించిన మన వాళ్ళ ప్రతిభను కళ్ళెదురుగా ఉన్నా మనం గుర్తించలేక పోవడం హాస్యాస్పదం. ఎక్కడెక్కడి వారికో ఆహ్వానాలు పంపి ఇంట్లో వాళ్ళను మర్చిపోయినట్లు ఉంది. ఇంట్లో వాళ్ళను పిలవాలా అని మళ్ళీ మరో ప్రశ్న వేయవద్దు. పిలువని పేరంటానికి ఎవరైనా ఎలా వస్తారు..? సాహిత్యం అందరికి సన్నిహితంగా ఉంటే  బావుంటుంది.మీ అంత గొప్పవాళ్ళు కాకపోయినా ఏదో అ ఆ లు నేర్చుకుంటున్న కొద్దిమందినయినా కాస్త ప్రోత్సహించండి. మీకేం పోటీ కాబోరు....!!

త్రిపదాలు...!!

1. ఆకర్షణకి వికర్షణకి మధ్యలో
నీ నా ల బంధం విలక్షణంగా
నిలబడి స్నేహానికి సరికొత్త అర్దానిస్తూ...!!

2. చీకటి చుట్టమై చేరినా
జ్ఞాపకాల నక్షత్రాలను దాయలేక
మది ముంగిలిలో వెన్నెలపూలు...!!
 

19, మార్చి 2017, ఆదివారం

విష పంజరాలెన్నో...!!

అంతర్జాలపు మాయాజాలంలో
ముఖచిత్రాల్లేని ముఖ పుస్తక ఖాతాలెన్నో

అస్తవ్యస్తపు ఆలోచనలతో
అధోగతి పట్టిన బతుకులెన్నో

అక్షరాలు సిగ్గుపడే రాతలతో
అగమ్య గోచరపు జీవితాలెన్నో

గమనం తెలియని శరాలతో
మనసులను చంపుతున్న కౄర మృగాలెన్నో

సప్తపదుల అర్ధాలకు క్రొంగొత్త భాష్యాలతో
అగాధపు అంచులలో కూలుతున్న కాపురాలెన్నో

క్రమ సంబంధాలు లేని బంధాలతో
అక్రమ సంబంధాలు ఆడుకునే ఆటలెన్నో

నమ్మకాన్ని వమ్ము చేస్తూ తమ నటనతో
వ్యాపారాలు చేస్తున్న కుహనావాదులెందరో
 
మరుగౌతున్న మానవతా విలువలతో 
కనుమరుగు కాలేని మాసిపోని మమతలెన్నో

నీలి నీడల చిత్ర 'వి'చిత్రాల వలయాలతో
వీక్షకులకు కొరత లేని వింత విష పంజరాలెన్నో...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner